Tuesday, July 20, 2021

Narappa Movie Review by Zee Cinemalu| Latest telugu news

నటీనటులు : విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల, నరేన్ , ప్రభాకర్, రాఖి త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు

సంగీతం: మణిశర్మ

కథ- స్క్రీన్ ప్లే : వెట్రిమారన్‌

నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్ , V క్రియేషన్స్

నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను

దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల

నిడివి : 153 నిమిషాలు

విడుదల తేది : 19 జులై 2021

విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' థియేటర్స్ లో వస్తుందని ఊహించిన ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు నిర్మాతలు. సినిమా డైరెక్ట్ గా OTT రిలీజ్ అనగానే ఇండస్ట్రీలో భారీ చర్చ నడిచింది. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెంకీ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. మరి ఇన్ని చర్చల నడుమ OTT లో రిలీజైన 'నారప్ప' ఆడియన్స్ ని మెప్పించిందా ? వెంకటేష్ ఈ రీమేక్ తో మరో విజయం అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

అనంతపురంలోని ఓ పల్లెటూరిలో తన భార్య సుందరమ్మ (ప్రియమణి) ముగ్గురు పిల్లలతో ఓ సాధారణ రైతు జీవితం గడుపుతుంటాడు నారప్ప (వెంకటేష్). అనుకోకుండా నారప్ప పెద్ద కొడుకుతో ఆ ఊరి పెద్ద పండు స్వామి (నరేన్) పొలం విషయంలో గొడవ పడతాడు. ఆ వివాదంతో ఊరి పెద్దపై నారప్ప పెద్ద కొడుకు ముణి కన్నా (కార్తీక్ జీవరత్నం) ఎదురుతిరుగుతాడు. తనపై ఎదురుతిరిగిన వెనకబడిన కులానికి చెందిన ముణి కన్నాని తన మనుషులతో కిరాతకంగా హతమారుస్తాడు పండు స్వామి.

తన తల్లి బాధ చూడలేక అన్నయ్య ని చంపిన పండు స్వామిని ఉద్వేగంతో చంపి తన పగ చల్లార్చుకుంటాడు సీనబ్బ(రాఖీ). హత్య కేసు నుండి అలాగే పండుస్వామి మనుషుల నుండి కాపాడుకోవడం కోసం సీనబ్బని తీసుకొని ఊరికి దూరంగా అడవిలోకి పారిపోతాడు నారప్ప. ఇంతకీ కొడుకుని చంపిన వారిపై నారప్ప ఎందుకు పగ తీర్చుకోలేదు..? ఎందుకు సాత్వికంగా ఉంటాడు ? అతని గతమేంటి ? చివరికి నారప్ప పండుస్వామి హత్య కేసు నుండి తన చిన్న కొడుకుని ఎలా కాపాడుకున్నాడు ? అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

రెండు డిఫరెంట్ లుక్స్ తో ఉండే క్యారెక్టర్ తో మెప్పించాడు వెంకటేష్. ముఖ్యంగా నారప్ప పాత్రలో ఒదిగిపోయి నటించాడు. గెటప్ నుండి నటన వరకు ఎక్కడా  వెంకీ కి వంక పెట్టడానికి లేదు. సెంటిమెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా ఎప్పటిలాగే అలరించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. నారప్ప భార్య పాత్రలో ప్రియమణి సహజమైన నటనతో ఆకట్టుకుంది. ముణి కన్నా క్యారెక్టర్ కి కార్తీక్ రత్నం పూర్తి న్యాయం చేశాడు. కార్తీక్ నటించిన కొన్ని సన్నివేశాలు చూస్తే ఆ పాత్రకి సరైన నటుడిని ఎంచుకున్నారనిపిస్తుంది. ఈ సినిమాతో కార్తీక్ మరిన్ని మంచి అవకాశాలు అందుకోవడం ఖాయం. అలాగే సీనబ్బ పాత్రలో నటించిన రాఖి మొదటి సినిమా అయినప్పటికీ మంచి నటన కనబరిచాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అమ్ము అభిరామి తన నటనతో ఫరవాలేదనిపించుకుంది.

ఒరిజినల్ లో చేసిన పాత్రే కావడంతో నరేన్ మరోసారి తన పాత్రకు బలం చేకూర్చాడు. లాయర్ పాత్రలో రావు రమేష్, బసవయ్యగా రాజీవ్ కనకాల మంచి నటన కనబరిచారు. శ్రితేజ, రామరాజు, వశిష్ట సింహా, దీపక్ శెట్టి, అరవింద్, కాదంబరి కిరణ్, రచ్చరవి మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు సినిమాటోగ్రఫీ , నేపథ్య సంగీతం ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి ఒరిజినల్ BGM వాడి ఇక్కడ కూడా అదే ఇంపాక్ట్ తీసుకొచ్చారు. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు పరవాలేదనిపించాయి తప్ప మళ్ళీ మళ్ళీ వినేలా లేవు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో అతని ప్రతిభ కనిపించింది. గాంధి ఆర్ట్ వర్క్ బాగుంది. అప్పటి కాలం లుక్ తీసుకొచ్చేలా వేసిన సెట్స్ ఎట్రాక్ట్ చేశాయి. ఎడిటింగ్ బాగుంది. పీటర్ హెయిన్స్, విజయన్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి.

వెట్రి మారన్ కథ, స్క్రీన్ ప్లేతో దర్శకుడిగా ఎలాంటి మార్పులు చేయకుండా నిజాయితిగా సినిమాను తీశాడు శ్రీకాంత్ అడ్డాల. తనలో ఫ్యామిలీ డైరెక్టర్ మాత్రమే కాదు మంచి మాస్ దర్శకుడు కూడా ఉన్నాడని ఈ సినిమాతో రుజువు చేశాడు. శ్రీకాంత్ అడ్డాల మాటలు ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

NARAPPA MOVIE REVIEW IN TELUGU ZEECINEMALU

జీ సినిమాలు సమీక్ష :

రీమేక్ సినిమాను రెండు రకాలుగా తీయొచ్చు. ఒకటి ఉన్నది ఉన్నట్టు మక్కీ కి మక్కీగా దించేయడం. ఇంకొకటి కాసిన్ని మార్పులతో రిస్క్ తీసుకొని తెరకెక్కించడం. నిజానికి రెండో మెథడ్ చాలా కష్టం. ఏ మాత్రం తేడా కొట్టినా అక్కడ హిట్టయిన సినిమా ఇక్కడ ఫట్టు మంటుంది. అందుకే కొందరు దర్శక నిర్మాతలు రీమేక్ లో మార్పులు చేయడానికి సాహసించరు. అలాంటి రిస్క్ తీసుకోరు. 'నారప్ప' విషయంలో మొదటి మెథడ్ నే ఫాలో అయ్యారు దర్శక నిర్మాతలు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ధనుష్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన 'అసురన్'ని ఎలాంటి మార్పులు చేయకుండా అంతే నిజాయితిగా చెప్పే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.

సినిమా మొదటి షాట్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉన్నది ఉన్నట్టు తీశాడు శ్రీకాంత్ అడ్డాల. నిజానికి నటీనటుల నుండి అదే ఎమోషన్ రాబట్టి సేమ్ ఇంపాక్ట్ తీసుకురావడం కూడా కష్టమే. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు. నిజానికి కొన్ని రీమేక్ సినిమాలు ఒరిజినల్ చూసిన ప్రేక్షకులకు అంతగా ఎక్కవు. ఎంత బాగా తీసినప్పటికీ ఏదో వెలితి కనిపిస్తుంది. కానీ 'అసురన్' చూసిన ఆడియన్స్ కి కూడా 'నారప్ప' నచ్చేలా తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ విషయంలో శ్రీకాంత్ ని మెచ్చుకోవాలి.

ఇక ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే అతి కొద్ది మంది హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ అసురన్ రీమేక్ చేస్తున్నాడని తెలియగానే కొన్ని కామెంట్స్ వచ్చాయి. కానీ వాటికి తన గెటప్ తో సగం సమాధానం ఇచ్చిన వెంకటేష్ ఇప్పుడు సినిమాలో తన నటనతో పూర్తి సమాధానం చెప్పాడు. చాలా ఏళ్ల తర్వాత నటనకి స్కోప్ ఉండే టెర్రిఫిక్ క్యారెక్టర్ దొరకడంతో నారప్ప గా రెచ్చిపోయాడు వెంకటేష్. వెంకీ నటన సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది. అలాగే క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చే నటీనటులను తీసుకోవడం కూడా సినిమాకి హెల్ప్ అయింది. ముఖ్యంగా ముని కన్నా పాత్రకు కార్తీక్ రత్నంని సీనబ్బగా రాఖి ని ఎంపిక చేసుకోవడం బాగా కలిసొచ్చింది. ప్రియమణి కూడా క్యారెక్టర్ కి ఫిట్ అయింది.

నిజానికి అణచివేత.. తిరుగుబాటుతో వెట్రిమారన్ రాసుకున్న ఈ కథ గతంలో మనం చూసిన సినిమాల్లో ఉన్నదే. ఇందులో కొత్తదనం ఏమి లేదు. కాకపోతే కథలో కమర్షియల్ అంశాలు జోడించి అలాగే మంచి ఎమోషన్ మిక్స్ చేసి రాసుకున్న స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో చదువు గొప్పదనం గురించి చెప్పించి మంచి సందేశం అందించాడు. అందుకే స్క్రీన్ ప్లేలో కూడా ఎలాంటి మార్పులు చేయకుండా వెట్రి మారన్ స్క్రీన్ ప్లేతోనే సినిమాను నడిపించాడు శ్రీకాంత్ అడ్డాల. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే మాత్రం మంచితనం.. మంచోళ్ళు అంటూ ఫ్యామిలీ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాలే ఈ సినిమా తీసాడా? అనే అనుమానం కలగక మానదు.ఈ సినిమాతో దర్శకుడిగా మాస్ యాక్షన్ కథలను కూడా డీల్ చేయగలనని నిరూపించుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. కాకపోతే తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించింది. వెంకటేష్ తో పాటు మన తెలుగు నటీ నటులు వరకూ ఓకె కానీ మిగతా క్యారెక్టర్స్ కి కూడా తెలుగు నటీ నటులను తీసుకోవాల్సింది. ఫైనల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్నీ మిక్సయిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన నారప్ప అందరినీ ఆకట్టుకుంటుంది.

 

ప్లస్ పాయింట్స్

వెంకటేష్ నటన

క్యారెక్టర్స్

నేపథ్య సంగీతం

సినిమాటోగ్రఫీ

యాక్షన్ ఎపిసోడ్స్

సంభాషణలు

మైనస్ పాయింట్స్

స్లో నరేషన్

ఫ్లాష్ బ్యాక్ లవ్ ట్రాక్

సాంగ్స్

బాటమ్ లైన్ : సేమ్ ఇంపాక్ట్ అప్ప

రేటింగ్ : 3 /5

Read More: http://www.zeecinemalu.com/en/movie-review/venkatesh-narappa-movie-review-in-telugu-zeecinemalu-192310/

No comments:

Post a Comment

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

  ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 1...